Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 61

Story of Sunahsepha- 1 !!

|| om tat sat ||

విశ్వామిత్రోమహాత్మాsథ ప్రస్థితాన్ ప్రేక్ష్య తాన్ ఋషీన్ |
అబ్రవీన్నరశార్దూల సర్వాంస్తాన్ వనవాసినః ||

తా|| ఓ నరశార్దూల ! అప్పుడు మహత్ముడైన విశ్వామిత్రుడు ఋషులందరూ వెళ్ళి పోగా అచటి వనవాసులను అందరినీ చూచి ఇట్లు పలికెను.

బాలకాండ
అరువదియొకటవ సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ కొనసాగించెను.

’'ఓ నరశార్దూల ! అప్పుడు మహత్ముడైన విశ్వామిత్రుడు ఋషులందరూ వెళ్ళి పోగా అచటి వనవాసులను అందరినీ చూచి ఇట్లు పలికెను. "ఈ దక్షిణ దిశలో వుండి మహత్తరమైన విఘ్నములు కలిగినవి. ఇంకొక దిశలో చేరెదము. అక్కడ తపస్సు చేసెదము. విశాలమైన పశ్చిమ దిశలో పుష్కరములలో మహాత్ములు ఉండెదరు. అచట సుఖముగా తపస్సు చేసెదము. అచటి తపోవనములు శ్రేష్ఠమైనవి".

మహతేజోవంతుడైన ఆ మహాముని ఇట్లు చెప్పి ఆ పుష్కరములలో ఫలమూలములు గ్రహించుచూ అగ్రమైన ఇతరులకు శక్యముకాని తపస్సు చేసెను.

అదే కాలములో అయోధ్యాధిపతి అంబరీషుడని పేరు గలవాడగు రాజు యజ్ఞము ప్రారంభించెను. ఆ యజమానియొక్క యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించెను. పశువు అపహరింపబడగా అ పురోహితులు రాజునకు ఇట్లు చెప్పిరి. "ఓ రాజన్ ! నీ దురదృష్టము వలన ఈ దినమున పశువు అపహరింపబడి కనపడుటలేదు. ఓ రాజా ! రక్షింపలేకపోయిన దోషము రాజుని హతమార్చును. దీనికి మహత్తరమైన ప్రాయశ్చిత్తము కొఱకు శీఘ్రముగా ఈ కర్మ జరుగుచుండగా యజ్ఞపశువును లేక ఒక నరుని తీసుకు రావలెను".

’'పురోహితుని మాటలను విని ఆ రాజు పశువు కోసము వేలకొలది గోవులతో ఒక బుద్ధిమంతుని వెదుకుటకు బయలు దేరెను. అ మహీపతి జనపదములు నగరములు వనములు పుణ్యమైన ఆశ్రమముల తో కూడిన మార్గములో వెళ్ళెను'.

'ఓ నాయనా ! రఘునందన ! అప్పుడు అంబరీషుడు భ్రుగు తుంగములో భార్యా పుత్త్రులతో సమాసీనుడైన ఋచీక మహర్షిని చూచెను'.

'ఆ మహర్షికి ప్రణామము చేసి, ప్రసన్నుని కావించుకొని మహా తేజము కల, తపస్సుయొక్క తేజస్సు తో ప్రకాశించుచున్న ఋచీకునితో అన్ని కుశలములను అడిగెను. తరువాత ఋచీకునితో ఆ రాజు ఇట్లు పలికెను. "ఓ భార్గవ ! పశువు కొఱకు సుతుని విక్రయించినచో నేను కృత కృత్యుడనగుదును. ఈ యజ్ఞపశువు కోసము అన్ని దేశములు గాలించితిని . కాని ఆ పశువు కనపడుటలేదు. తగిన మూల్యమునకు ఒక సుతును ఇమ్ము" అని.

'అ మహాతేజో వంతుడు అగు అంబరీషుడు ఇట్లు చెప్పగా ఋచీకుడు ఇట్లు పలికెను."ఓ నరశ్రేష్ఠ ! నేను జ్యేష్ఠపుత్రుని ఎట్టి పరిస్థితులలోను విక్రయింప జాలను". మహాత్ముడైన ఋచీకుని వచనములను విని తపశ్విని అగు వారియొక్క మాత నరశార్దూలమైన ఆ అంబరీషునితో ఇట్లుపలికెను. "భగవాన్ భార్గవ తన జ్యేష్ఠపుత్రుని విక్రయింపజాలను అని చెప్పెను. ఓ రాజా నాకు కూడా కనిష్ఠ కుమారునిపై ప్రాణము. అందువలన కనిష్ఠపుత్త్రుని కూడా విక్రయింప జాలము. ఓ నరశ్రేష్ఠ ! బహుశః పెద్ద కుమారుడు తండ్రికి ప్రియమైనవాడు. తల్లులకు చిన్న వాడు. అందువలన కనిష్ఠుని రక్షింపవలెను".

'ఓ రామా ! అప్పుడు ఆ ముని ఆదే విథముగా ఆ మునిపత్ని చెప్పిన మాటల విని మహ్యముదగు శునశ్శేఫుడు ఇట్లు పలికెను. "ఓ రాజా ! తండ్రి జ్యేష్ఠకుమారుని అమ్మడు. తల్లి చిన్నవాన్ని అమ్మను అనెను.(అందుకని) మధ్యమ పుత్రుని అమ్మినట్లే తలంతును."

'ఓ రఘునందన! పిమ్మట వంద వేల గోవులను ఇచ్చి మధ్యముడగు శునశేఫుని తీసుకొని అంబరీషుడు అతి సంతోషముతో శునశేఫుని రథముపై కూర్చొనబెట్టి తన నగరమునకు వెళ్ళెను'.

ఈ విథముగా శ్రీమద్ రామాయణములో బాలకాండలో అరువది ఒకటవ సర్గము సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||